: ఆలస్యమైన మాట నిజమే!... మా మీద నమ్మకముంచండి!: చంద్రబాబుకు మోదీ భరోసా!


ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా నిన్న హస్తిన వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి గట్టి హామీనే లభించినట్లు సమాచారం. ప్రధానితో భేటీ తర్వాత తీరికగా నిన్న సాయంత్రమే ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అయినా భేటీలో చంద్రబాబుకు మోదీ ఏ మేర హామీ ఇచ్చారన్న విషయంపై ఓ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ఆసక్తికర కథనాన్ని రాసింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగీదిగగానే నేరుగా సౌత్ బ్లాక్ వెళ్లిన చంద్రబాబు ప్రధానితో సమావేశమయ్యారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ తర్వాత ప్రధాని కార్యాలయం నుంచి చంద్రబాబు కాస్తంత ధీమాగానే బయటకు వచ్చారు. భేటీలో జరిగిన చర్చల విషయానికొస్తే ఆ పత్రిక రాసిన కథనం ప్రకారం... ‘మీ రాష్ట్రం పరిస్థితి మాకు తెలుసు. మేం ఏం చేయగలమో తప్పక చేస్తాం. ఇప్పటికే ఆలస్యమైన మాట నిజమే. సమస్యలు పరిష్కరిస్తాం. మా మీద నమ్మకముంచండి’’ అని చంద్రబాబుకు మోదీ గట్టి హామీనే ఇచ్చారు. దీంతోనే భేటీ ముగియగానే బయటకు వచ్చిన చంద్రబాబు ముఖంలో ఆత్మ విశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపించింది.

  • Loading...

More Telugu News