: వంగవీటి బాధ్యతలు జక్కంపూడికి ట్రాన్స్ ఫర్!... బెజవాడ వైకాపా అధ్యక్షుడిగా రాధా!
ఏపీలో విపక్ష వైసీపీలో రెండు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటిదాకా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కీలక నేత వంగవీటి రాధాను ఆ పదవి నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా వంగవీటి రాధా కొనసాగుతారు. అదే సమయంలో సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు జక్కంపూడి రాజాను ఆ పార్టీ రంగంలోకి దించింది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న అధికారికంగా ఉత్వర్వులు జారీ చేసింది. మరోవైపు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన గుబ్బ చంద్రశేఖర్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సామినేని ఉదయభాను, రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడకు చెందిన పైలా సోమినాయుడులు నియమితులయ్యారు.