: రేప్ పై తీవ్రంగా స్పందించిన సిక్కిం సీఎం...'దోషిని దాయొద్దు, ప్రపంచానికి చూపండి' అంటూ పోలీసులకు ఆదేశం!
పశ్చిమ బెంగాల్ కు చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో దోషి ముఖాన్ని ప్రపంచానికి చూపాలని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే...పదో తరగతి పరీక్షలు పూర్తి కావడంతో పశ్చిమ బెంగాల్ కు చెందిన 16 ఏళ్ల బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా గ్యాంగ్ టక్ లో ఓ ట్యాక్సీని బాడుగకు తీసుకున్నారు. ప్రేమ్ రాయ్ అనే ఆ ట్యాక్సీ డ్రైవర్ మార్గమధ్యంలో వీరికి స్నాక్స్ తోపాటు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. విషయం తెలియని ఆ ముగ్గురూ మత్తులోకి జారుకుంటుండగా డ్రైవర్ ఒక బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇంతలో మెలకువ వచ్చిన ఆమె స్నేహితులు ఇద్దరూ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిద్దరినీ బలంగా కొట్టి కిందకు తోసి ఆ బాలికను తీసుకుని డ్రైవర్ పరారయ్యాడు. దీంతో వారు ఏడ్చుకుంటూ బంధువులకు ఫోన్ చేసి విషయం వివరించారు. దీంతో అప్రమత్తమైన ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ సంఘటన సిక్కింలో కలకలం రేపింది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి దీనిపై ప్రకటన చేస్తూ, పర్యాటకులతో స్నేహంగా మెలిగే రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దుర్మార్గమని, అలాంటి వారిని క్షమించే పరిస్థితి లేదని, నేరస్థుడిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని, అతని రూపాన్ని బహిర్గతం చేయాలని, నలుగురిలో నిలబెట్టాలని పోలీసులను ఆదేశించారు.