: సామాన్యుడే... కానీ, స్పూర్తి నింపే ఆటోవాలా!
కొన్ని ప్రయాణాలు గొప్ప అనుభూతులుగా మిగులుతాయి. అలాంటి అనుభూతే తాజాగా వినీత్ విజయన్ అనే వ్యక్తికి ఎదురైంది. ఓ సామాన్యుడైన 'గొప్ప వ్యక్తి' గురించి వినీత్ ఫేస్ బుక్ లో పోస్టు చేయగా, అది వైరల్ గా మారి షేర్ అవుతూపోతోంది. వివరాల్లోకి వెళ్తే...బెంగళూరుకు చెందిన వినీత్ విజయన్ ఇటీవల ఓ యువకుడు నడిపే ఆటోలో ప్రయాణించాడు. స్థానిక మెడికల్ కాలేజీకి చేరుకున్నాక దిగిన వినీత్ 'ఎంతైంది?' అని అడిగాడు. దీంతో 'మీకు నచ్చినంత ఆ డబ్బాలో వేయండి సర్' అని ఆ ఆటోవాలా సమాధానమిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన వినీత్ తేరుకునేలోగానే, గేటు ముందు ఆగిన ఆటోను పక్కకి తీయమని చెప్పేందుకు వచ్చిన ఈ మెడికల్ కాలేజీ గేట్ కీపర్, ఆటోవాలాకి రెండు చేతులు జోడించి ‘నమస్కారం సర్’ అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. అది చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు వినీత్. దీంతో అతని గురించి ఎలాగైనా తెలుసుకోవాలని, గేట్ కీపర్ ను అడిగాడు. ఆ యువకుడి తండ్రి చనిపోయాడని, అతని సోదరుడికి పక్షవాతమని, అతనికి ఇద్దరు చెల్లెళ్లున్నారని చెప్పాడు గేట్ కీపర్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు ఆ కాలేజీలో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడని చెప్పాడు. గత రెండేళ్లు వైద్య విద్యలో మంచి మార్కులు తెచ్చుకోవడంతో అతనికి కళాశాల యాజమాన్యం బహుమతిగా ఏం కావాలని అడిగింది. దీంతో తనకు బహుమతిగా ఆటో అడిగాడు. అలా కళాశాల యాజమాన్యం కొనిచ్చిన ఆటోను, ఖాళీ సమయంలో ఆ యువకుడు నడుపుతున్నాడు. అలా వచ్చిన డబ్బును నిరుపేద రోగుల కోసం ఖర్చు చేస్తుంటాడు. అలా అని ఏ ప్రయాణికుడిని ఇంత ఇవ్వు అని ఆయన డిమాండ్ చేయడు. ఆ ఆటోలో ఆయన ఏర్పాటు చేసిన డబ్బాలో ఎంత వేస్తే అంత తీసుకుంటాడు. ఈ గాథను తెలుసుకున్న వినీత్ అతని ఫోటోను తీసి, ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. షేర్ల మీద షేర్లతో దూసుకుపోతోంది.