: ఇతర రాష్ట్రాలకు సమానంగా ఏపీ ఎదిగే వరకు స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలి: చంద్రబాబు
దేశంలోని అన్ని రాష్ట్రాలతో ఏపీ సమాన స్థాయికి వచ్చే వరకు స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తామేమీ కేంద్రాన్నే అన్నీ చేయాలని అడగడం లేదని చెప్పారు. తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని ఆయన అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేసే బాధ్యత కేంద్రం మీద ఉందని ఆయన తెలిపారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని, ప్రతి ఏటా 35 వేల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయామని ఆయన తెలిపారు. ఈశాన్య భారతంలో ప్రత్యేకహోదా పొందుతున్న రాష్ట్రాల స్థాయి ఏమాత్రం పెరగలేదని ఆయన అన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఏపీ పరిస్థితి కోడా ఇలాగే తయారైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉందని, అందుకని ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత వాటిపై ఉందని ఆయన తెలిపారు.