: నాగార్జున సాగర్, శ్రీశైలం సమస్యలకు పరిష్కారం ఏంటి?: చంద్రబాబు
నాగార్జున సాగర్, శ్రీశైలం సమస్యలకు పరిష్కారం ఏంటి? అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 'రెండు ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. దీనికి ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ విధివిధానాలపై నిర్ణయం తీసుకుని, పరిష్కారం చూపాల్సిన కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోలేదు' అన్నారు ముఖ్యమంత్రి. పంపకాలు జనాభా ప్రాతిపదికన జరగాలని నిర్ణయించి, చివరికి ఆ రకంగా మాత్రం చేయలేదని ఆయన తెలిపారు. హేతుబద్ధత లేకుండా విభజన చేశారని ఆయన గుర్తు చేశారు. వరదలు వస్తే ఏపీ నష్టపోయేలాగ, వరదలు రాకపోతే ఎగువ రాష్ట్రాలు లాభపడేలాగ నిర్ణయాలు తీసుకుంటే ఏం చేయాలని ఆయన అడిగారు. ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధానికి తెలిపానని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా ఇస్తే తప్ప రాష్ట్రం కోలుకోదని తాను ప్రధానికి వివరించానని ఆయన అన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హోదా హామీని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశానని ఆయన తెలిపారు. ఇవన్నీ చెప్పి, న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రధాని, ఆర్థిక మంత్రిని కోరానని ఆయన చెప్పారు. వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.