: పార్టీ వీడిన వారిని ఎంత పెద్దవారైనా తిరిగి చేర్చుకోవద్దు: టీకాంగ్ నిర్ణయం
గతంలో పార్టీని వీడిన వారు ఎంత పెద్ద నేత అయినా తిరిగి సొంత గూటికి చేరుకోవాలని భావించి వస్తానంటే చేర్చుకోకూడదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో టీపీపీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగిన సందర్భంగా నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్ కరపత్రాలుగా మారిన 'నమస్తే తెలంగాణ' న్యూస్ పేపర్, 'టీన్యూస్' టీవీ ఛానెల్ ను బహిష్కరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని వారు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, కరవు సందర్భంగా ప్రజలకు అండగా నిలవడంలో ప్రభుత్వం విఫలమైందని వారు పేర్కొన్నారు. ప్రజాసమస్యలపైన, టీఆర్‌ఎస్ గతంలో ఇచ్చిన హామీల అమలుపైన పోరాడాలని ఈ సందర్భంగా అంతా నిర్ణయించారు.