: బీజేపీకి అంతగా సంతృప్తినివ్వని ఎగ్జిట్ పోల్స్!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెల్లడి కానుండగా, ఇప్పటికే వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు, అసోంలో బీజేపీ అధికారంలోకి రానుందని నొక్కి చెబుతున్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ ఏమంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ ఎన్నికల తరువాత కేరళలో నిర్ణయాత్మకంగా ఉంటామన్న ఆ పార్టీ ఆలోచన నెరవేరుతుందన్న ఆశలు లేకపోగా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కనీస గుర్తింపు కూడా రాకపోవచ్చని వస్తున్న అంచనాలు ఆ పార్టీకి అశనిపాతమేనని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన స్పందించారు. ఒక్క అసోంలో మాత్రమే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతూ, బీహార్ ఎన్నికల వేళ ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయన్న విషయాన్ని గుర్తు చేశారు. "గుర్తుంచుకోండి... బీహార్ లో ఎన్నికల అనంతరం అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజైవైంది. వాస్తవ ఫలితాలకు ఏ ఒక్క సంస్థ కూడా కనీసం దగ్గరకు రాలేకపోయింది. 19వ తేదీ వరకూ వేచి చూడండి" అని అసోంలోనూ బీజేపీ అధికారంలోకి రాబోదన్నట్టు మాట్లాడారు. కాగా, తమిళనాడులో ఫలితం అంచనాలకు విరుద్ధంగా రావచ్చన్న భావన సైతం లాలూ వ్యాఖ్యల్లో కనిపించింది. వాస్తవానికి బెంగాల్ లో అధికారం కైవసం చేసుకుంటామని బీజేపీ ఎన్నడూ భావించలేదు. ఇక కేరళ, తమిళనాడుల్లో సైతం పాగా వేస్తే చాలని ఆ పార్టీ భావించింది. ఇప్పుడు ఆ అవకాశం సైతం లేదన్నది నిపుణుల భావన. ఇదే సమయంలో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే, అది మోదీకి మరో రకంగా ఓటమి కిందే లెక్క. ఇప్పటికే రాజ్యసభ సభ్యులను కోల్పోయిన కాంగ్రెస్, తదుపరి ఆ సంఖ్యను పెంచుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి కాబట్టి. ఆ రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే స్థానాల్లో గెలుపొందేవారు పరోక్షంగా కాంగ్రెస్ ఖాతాలోకి చేరినట్టే. ఇది ఓ రకంగా ఎన్డీయేకు చుక్కెదురే.