: మరో 2 గంటలు ఆగాల్సిందే!.... సాయంత్రం 4 గంటకు చంద్రబాబు మీడియా సమావేశం
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం హామీ ఇచ్చిందా? ఆ మేరకు చంద్రబాబు అనుకున్నది సాధించారా? ఈ విషయం తేలాలంటే మరో రెండు గంటల పాటు వేచి చూడక తప్పని పరిస్ధితి. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా నేటి ఉదయం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు 1.20 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రధాన మంత్రిత్వ కార్యాలయం సౌత్ బ్లాక్ లో జరిగిన ఈ భేటీ ముగియగానే చంద్రబాబు బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఏపీ భవన్ కు వెళ్లిపోయారు. ఇక ఈ భేటీలో ఏమేం మాట్లాడామన్న విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు నేటి సాయంత్రం 4 గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకించి ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.