: పూరీ జగన్నాథాలయం ఏ సమయంలోనైనా కూలిపోవచ్చు: ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెచ్చరిక
ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథాలయం పరిస్థితిపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్నాథాలయం ఏ సమయంలోనైనా కూలిపోవచ్చని హెచ్చరించారు. దీనిపై సత్వర చర్యలకు దిగకపోతే నష్టం తప్పదని టెక్నికల్ కోర్ కమిటీ ఛైర్మన్ జీసీ మిత్రా పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీకి పూరీ జగన్నాథాలయం పరిస్థితిపై లేఖ రాశారు. ఆలయ అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లేఖలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదని కూడా ఆయన మోదీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. పూరీ జగన్నాథాలయ అభివృద్ధి చర్యలపై కేంద్రమంత్రులు దర్మేంద్ర ప్రధాన్, మహేశ్ శర్మ నిన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశం నిర్వహించారు. కొన్ని సాంకేతిక కారణాలవల్లే ఆలయ పునరుద్ధరణ పనులు ఆలస్యం అవుతున్నాయని ఈ సందర్భంగా దర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు. ఆలయ పునరుద్ధరణ పనులకోసం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని పేర్కొన్నారు.