: టీడీపీని మిత్రపక్షంగా గుర్తుంచుకోకుంటే ఎలా?: సోము వీర్రాజుకు రాయపాటి చురక
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లెందుకంటూ చంద్రబాబు సర్కారుపై నోరు పారేసుకున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు టీడీపీ నేత, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చురకలంటించారు. గుంటూరులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాయపాటి... వీర్రాజు వ్యాఖ్యలపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంపై వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సరికాదని రాయపాటి పేర్కొన్నారు. టీడీపీ మిత్రపక్షమన్న విషయాన్ని బీజేపీ నేతలు మరిచిపోతే ఎలాగంటూ రాయపాటి సుతిమెత్తగానే చురకలంటించారు. బీజేపీ నేతలు పరిధి దాటి మాట్లాడకుండా సంయమనం పాటించాలని కూడా ఆయన సూచించారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడిన రాయపాటి... కేంద్రం స్పందనను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.