: రఘురాం రాజన్ మానసికంగా పరిపూర్ణుడైన భారతీయుడు కాదు, ఆర్‌బీఐ గవర్నర్ హోదా నుంచి తొలిగించండి: సుబ్రహ్మణ్య స్వామి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు రఘురాం రాజన్ పై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి మండిపడ్డారు. రఘురాం రాజన్ మానసికంగా పరిపూర్ణుడైన భారతీయుడు కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్ హోదా నుంచి ఆయనను తొలిగించాల్సిందేనని సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ‘దేశంలో రఘురాం రాజన్ గ్రీన్ కార్డుపై ఉన్నారు.. కాబట్టి ఆయన మానసికంగా పరిపూర్ణుడైన భారతీయుడు కాదు’ అని లేఖలో పేర్కొన్నారు. రఘురాం రాజన్ నాయకత్వలో భారతీయ ఆర్థిక వ్యవస్థ కూలిపోవడంపై తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ‘దేశంలో ప్రస్తుతం ఎంతో మంది భారతీయ జాతీయ భావాలున్న ప్రతిభావంతులు ఉండగా యూపీఏ ప్రభుత్వం గతంలో నియమించిన వ్యక్తే ఇంకా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఎందుకు కొనసాగాలి?’ అని స్వామి ప్రశ్నించారు. దేశ ఆర్థిక పురోగతిలో భాగంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను వెంటనే తొలిగించాలని కోరారు.