: ఆప్ 5, కాంగ్రెస్ 4, బీజేపీ 3... ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కు పరాభవం!
ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీపై కాస్తంత నమ్మకాన్ని కోల్పోయారు. ఆప్ వస్తే, సామాన్యుడి పార్టీ వచ్చినట్టని, తమకు కొండంత మేలు చేకూరుతుందని, ఆ పార్టీకి ఘనవిజయం కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు వెనక్కు తగ్గారు. ఢిల్లీలోని 13 వార్డులకు ఉపఎన్నికలు జరుగగా, వాటిల్లో ఆప్ కేవలం ఐదింటిని మాత్రమే గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ 13 స్థానాల్లో 12 స్థానాలు ఆప్ వే కాగా, ఇప్పుడు వాటిల్లో ఏడింట ఆ పార్టీ ఓటమి పాలైంది. మొత్తం 13 స్థానాల్లో బీజేపీ 3, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించగా, ఓ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలు ఆప్ కు ప్రజలు దూరమవుతున్నారన్న సంకేతాలు వెలువరిస్తున్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, తమకు మెజారిటీ సీట్లు రావడం పట్ల ఆప్ కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. తాము మరిన్ని స్థానాలు వస్తాయని భావించామని, అయినప్పటికీ, తాము ఇప్పటికీ నెంబర్ వన్ గా ఉన్నామని ఆ పార్టీ నేత దిలీప్ పాండే వ్యాఖ్యానించారు.