: కోహ్లీ... 'బ్యాట్ మన్', డివిలియర్స్... 'సూపర్ మ్యాన్'!: ‘రాయల్స్’ సహచరులపై గేల్ ప్రశంసలు
టెస్టు.. వన్డే.. చివరకు పొట్టి ఫార్మాట్ టీ20... మ్యాచ్ ఏదైనా సరే బంతిని బాదడమే లక్ష్యంగా బ్యాటు ఝుళిపిస్తున్న టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అతడు మూడు సెంచరీలు చేసి ... ఐపీఎల్ ఒకే సీజన్ లో మూడు శతకాలు బాదిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. ఇక వయసు పెరుగుతున్నా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెట్ సంచలనం ఏబీ డివిలియర్స్ కూడా అతడికి ఏమాత్రం తీసిపోని రీతిలో పరుగులు రాబడుతున్నాడు. వీరిద్దరి ప్రతాపం ముందు పించ్ హిట్టర్ గా పేరున్న విండీస్ సంచలనం క్రిస్ గేల్ వెలవెలబోతున్నాడు. ప్రస్తుతం వీరు ముగ్గురూ ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సభ్యులుగా కొనసాగుతున్నారు. అందుకేనేమో తన ఆటను పక్కనపెట్టేసిన గేల్... సహచర క్రికెటర్లు కోహ్లీ, డివిలియర్స్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు. కోహ్లీని బ్యాట్ మన్ గా అభివర్ణించిన అతడు, డివిలియర్స్ ను సూపర్ మ్యాన్ తో పోల్చాడు.