: మాల్యాకు శుభవార్త... మారిన బ్యాంకుల వైఖరి!
బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా తాజా ప్రతిపాదనలపై బ్యాంకులు సానుకూలంగా స్పందించాయి. తమకు రుణాల వసూలు మాత్రమే ముఖ్యమని వెల్లడించాయి. మాల్యా, తాను తిరిగి వచ్చి రుణాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తానని, అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం హామీ ఇస్తేనే ఇది జరుగుతుందని వెల్లడించిన నేపథ్యంలో ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం స్పందించింది. మాల్యా ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి హామీ లభిస్తే, ఆయన ఇండియాకు వచ్చినా ఇబ్బంది పెట్టబోమన్న సంకేతాలు ఇచ్చాయి. మొత్తం 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్, యూబీ గ్రూప్ లకు రూ. 7 వేల కోట్ల రుణాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న అసలు రూ. 6,868 కోట్లను సుప్రీంకోర్టుకు డిపాజిట్ చేయాలని సూచించగా, బ్యాంకులు అందుకు అంగీకరించకుండా, తమకు వడ్డీ సహా పూర్తి వసూళ్లు రావాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అంతమొత్తం రావాలంటే కష్టసాధ్యమని భావించిన బ్యాంకులిప్పుడు వెనక్కు తగ్గాయి. తమకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వ రక్షణ లభించే పక్షంలో తాము ఆయన్ను ఇబ్బంది పెట్టబోమని ప్రముఖ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, కాగ్ లేదా సీబీఐ కవర్ లేకుండా ఏ బ్యాంకరైనా ఆయనతో డీల్ కుదుర్చుకునేందుకు ముందుకు రాకపోవచ్చని మరో బ్యాంకు ప్రతినిధి అభిప్రాయపడ్డారు. మాల్యా ఇండియాకు వచ్చి బకాయిలు చెల్లిస్తే చాలని వివరించారు. ఇందుకు మధ్యేమార్గంగా ఏదైనా డీల్ కుదురుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న విజయ్ మాల్యాను ఎలాగైనా ఇండియా తీసుకువస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే.