: పిన్నమనేని సతీమణి మృతికి చంద్రబాబు సంతాపం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. భార్యతో కలిసి విజయవాడ నుంచి హైదరాబాదు బయలుదేరిన పిన్నమనేని కారు హైదరాబాదు సమీపంలోని తుక్కుగూడ వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పిన్నమనేనికి తీవ్ర గాయాలు కాగా, సాహిత్యవాణితో పాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న చంద్రబాబు... నేటి ఉదయం ఢిల్లీ బయలుదేరే ముందు సంతాపం తెలిపారు. పిన్నమనేని ఆరోగ్య పరిస్థితిపై ఆయన పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు.