: వివాదాల మయమవుతున్న 'అజార్' జీవిత కథ సినిమా... గరం గరంగా వున్న మాజీ క్రికెటర్లు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా డైరెక్టర్, మాజీ ఆటగాడు రవిశాస్త్రి ఈ సినిమాలో తన పాత్రను చిత్రించిన తీరుపై మండిపడుతున్నాడని సమాచారం. 'అజార్' సినిమాలో రవిశాస్త్రి పాత్రను బిగ్ బాస్ ఫేం గౌతం గులాటీ పోషించాడు. కాగా, ఈ సినిమాలో క్రికెటర్ల పేర్లను ఉపయోగించలేదు. అదే సమయంలో వారిని వదల్లేదు, డ్రెస్సింగ్ రూంలో పిలుచుకునే పేర్లతో సినిమాలో వారిని సంబోధించారు. అజార్, రవి, నవజ్యోత్, మనోజ్, కపిల్ అంటూ పాత్రలను పండించారు. వీరంతా అజార్ కెప్టెన్సీలో ఆడినవాళ్లే. గౌతం గులాటీ 'రవి'గా కనిపించిన పాత్రను పూర్తిగా స్త్రీలోలుడిగా చూపించగా, ఓ సందర్భంలో తన వెంటనున్న భార్యను కూడా మోసం చేసి మరో యువతితో గడపడంపై రవిశాస్త్రి గరం గరంగా ఉన్నాడని తెలుస్తోంది. రవిశాస్త్రి కుటుంబ సభ్యులు కూడా 'ఇలా చూపించారేమిటా?' అని అడుగుతున్నారట. దీనిపై రవిశాస్త్రి బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరో క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అజార్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చిందే మనోజ్ ప్రభాకర్ కావడం విశేషం. విడిపోయిన తరువాత భర్తను కనీసం గుర్తు చేసుకోని అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్ లానీ సుదీర్ఘ విరామం తరువాత, ఈ సినిమాలో తన పాత్ర గురించి అతన్ని అడిగింది కూడా. అప్పుడు భయపడొద్దని అజార్ వివరణ ఇచ్చినప్పటికీ, సినిమాలో ఆమెను చూపిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆమె కూడా సినిమా యూనిట్ పై చర్యలకు దిగుతుందని కొందరు అంటుండగా, సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక చర్యలు తీసుకునే అవకాశం లేదని ఓ వర్గం చెబుతోంది. మొత్తానికి అజహరుద్దీన్ కెరీర్ చరమాంకం లాగే ఆయన సినిమా కూడా వివాదాలకు కేంద్ర బిందువైంది.