: రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అస్వస్థత...గత అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు
టాలీవుడ్ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు లోనయ్యారు. హైదరాబాదులో నివాసం ఉండే కృష్ణంరాజు శ్వాసతీసుకునేందుకు తీవ్ర ఇబ్బందిపడుతూ, అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు, ఆయనను హుటాహుటీన బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ కు తరలించారు. దీంతో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్య బృందం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తోంది. కాగా, శ్వాస సంబంధిత వ్యాధితో కృష్ణంరాజు బాధపడుతున్నట్టు వారు వెల్లడించారు. గత అర్ధరాత్రి ఆయనను ఆసుపత్రిలో చేర్చగా, నేటి ఉదయం సినీ నటుడు ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు వద్ద గడిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కృష్ణంరాజు అస్వస్థత గురించి తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.