: జికా వైరస్ నుంచి రక్షణకు... ‘రియో’ ఒలింపిక్స్ అథ్లెట్లకు కండోమ్స్
దోమ కాటు ద్వారా జికా వైరస్ మనుషులకు వ్యాప్తిస్తుంది. అయితే, శృంగారం ద్వారా ప్యూర్టోరికో మహిళకు జికా వైరస్ సోకింది. ఈ విషయంలో ఇది తొలికేసని జర్మనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఒలింపిక్ మిషన్ చీఫ్ కిట్టీ చిల్లర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. రియో ఒలింపిక్స్- 2016లో పాల్గొననున్న క్రీడాకారులకు కండోమ్ లు అందించనున్నారు. ఈ కండోమ్ లలో వైరస్ నిరోధక లూబ్రికెంట్స్ ఉంటాయి. స్టార్ ఫార్మా సహకారంతో ఈ వైరస్ నిరోధక ప్రత్యేక కండోమ్ లు తయారు చేయించి బ్రెజిల్ లోని రియోకు సరఫరా చేయనున్నారు. ముందస్తు నష్ట నివారణా చర్యల్లో భాగంగానే క్రీడాకారులకు మరింత రక్షణ కలిగించే ఈ కండోమ్ లను అందించనున్నామని కిట్టీ చిల్లర్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ ఒలింపిక్స్ జరగనున్నాయి. బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో జరగనున్న ఈ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఇప్పటికే 8,255 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. అయితే, 10,500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరాకన్ స్టేడియంలో ఆగస్టు 5వ తేదీన ఓపెనింగ్ సెరిమనీ అట్టహాసంగా నిర్వహించేందుకు రియో ఒలింపిక్స్ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.