: గుజరాత్ సీఎం కుర్చీపై నితిన్ భాయ్ పటేల్..? ఆనంది బెన్ పటేల్ ను తొలగించే యోచనలో బీజేపీ పెద్దలు
గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ అధిష్ఠానానికి మధ్య మరింత సమన్వయం ఏర్పరచడం, రాష్ట్రంలో బీజేపీపై వస్తోన్న వ్యతిరేకతను తగ్గించే క్రమంలో ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో భారీగా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, గతంలో హార్ధిక్ పటేల్ ఆధ్వర్యంలో చెలరేగిన రిజర్వేషన్ల ఆందోళనపై సుదీర్ఘంగా మంతనాలు జరిపిన బీజేపీ పెద్దలు చివరికి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్‌ను సీఎం కుర్చీ నుంచి దింపేయాలని యోచిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నితిన్ భాయ్ పటేల్ ను నియమించాలని సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ మరోసారి విజయ ఢంకా మోగించాలంటే పలు మార్పులు తప్పవని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆనంది బెన్ పటేల్ ను గవర్నర్ గా నియమించి, నితిన్ భాయ్ పటేల్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించే దిశగా బీజేపీ యోచిస్తోంది. ఆ రాష్ట్ర మంత్రుల పదవుల్లోనూ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయంలో పార్టీ ఓ నివేదిక సమర్పించిందని తెలుస్తోంది. మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత ఆనందిబెన్ పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా ఆమె నియమితమైన అనంతరం ఆ రాష్ట్రంలో హార్ధిక్ పటేల్ నాయకత్వంలో పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం తీవ్ర స్థాయిలో చెలరేగింది. అయితే, ఈనెల ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థుల ఉపకార వేతనాల్లో వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించింది.