: బీచ్ కు వెళ్లిన యువతికి షాకిచ్చిన షార్క్!
బీచ్ లో స్నానం చేస్తే ఎంజాయ్ చేద్దామనుకుని వెళ్లిన ఒక యువతికి చేదు అనుభవం ఎదురైన సంఘటన ఫ్లోరిడాలోని బోకా రాటోన్ లో జరిగింది. 23 ఏళ్ల ఒక యువతి స్నానం చేసేందుకని సముద్రంలోకి దిగింది. అంతే, గట్టిగా కేకలు వేస్తూ, భయంతో వణికిపోతూ బయటకు పరిగెత్తుకు వచ్చింది. విషయం ఏమిటో కనుక్కుందామని ఆమెను పలకరించిన వాళ్లు ఆమె చేతిని చూసి ఆశ్చర్యపోయారు. సుమారు రెండడుగుల పొడవు ఉండే ఒక షార్క్ ఆ యువతి కుడిచేతిని తన పళ్లతో కరిచి పట్టుకుంది. దానిని వదలించుకుందామని ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ అది వదలలేదు. షార్క్ పళ్లు పూర్తిగా ఆమె చేతిలోకి దిగిపోయి, ఎంతకీ రాలేదు. దీంతో అక్కడి అత్యవసర విభాగంకు ఫోన్ కాల్ చేయడంతో సిబ్బంది ఆ బీచ్ కు చేరుకున్నారు. ఆమె చేతిని కరచిపట్టుకున్న షార్క్ ను విడదీయలేకపోయారు. దీంతో చేసేదేమీలేక ఆ షార్క్ ను కొట్టి చంపేశారు. అయినప్పటికీ, దాని పళ్లు ఆమె చేతినే పట్టుకుని ఉన్నాయి. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.