: బ్రహ్మంగారు చెప్పింది జరిగేట్టుంది: జగన్
"బ్రహ్మంగారు అప్పుడెప్పుడో చెప్పారు.. నీళ్ల వలనే యుద్ధాలు జరుగుతాయని! నిజంగా ఇవాళ కేసీఆర్ పాలన చూస్తుంటే, నీళ్లకోసమే యుద్ధాలు జరుగుతాయేమోనని భయాందోళన కలుగుతోంది. ఆయన పాలన యుద్ధానికి దారితీసేట్టుంది. ఈ జలదీక్షతోనైనా ఆయనలో మార్పు రావాలి. మనమంతా ఒకటిగా కలిసి అక్రమ ప్రాజెక్టులపై యుద్ధం ప్రకటించాలి. నేతల్లో మార్పు రావాలి. మనందరమూ కలిస్తేనే వీరిలో మార్పువస్తుందని మనస్ఫూర్తిగా చెబుతూ, ఈ పోరాటంలో అందరం భాగస్వాములై ముందుకు కదలాలని సవినయంగా మరొక్కసారి పేరు పేరునా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. మన నీళ్లను మనం కాపాడుకోవాలంటే, ప్రతి ఒక్కరూ కదిలిరావాలి. మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి అక్కా చెల్లెమ్మ, ప్రతి అవ్వా తాత, ప్రతి అన్నా తమ్ముడూ ఉద్యమించాలి. ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని మరొక్కసారి హృదయపూర్వకంగా కోరుతున్నా" అని వైసీపీ అధినేత జగన్ తన మూడు రోజుల నిరాహార దీక్షను ప్రారంభించారు. జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి అడుగడుగునా స్పందన రావడంతో వైకాపా శ్రేణులు ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది.