: ఈ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోకుంటే మార్కెట్లు కుదేలు!


తుది దశకు చేరుకున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కొంతమేరకైనా పుంజుకున్న సంకేతాలు కనిపించకుంటే, భారత స్టాక్ మార్కెట్లు భారీ ఒత్తిడికి లోనవుతాయని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)కు అనుకూల ఫలితాలు రాకుంటే, ప్రస్తుత స్థాయి నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ కరెక్షన్ దిశగా సాగుతాయని డాల్టన్ కాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ యూఆర్ భట్ అంచనా వేశారు. ఇప్పటికే రుతుపవనాలు, కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు, ద్రవ్యోల్బణం తదితరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయని, సమీప భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని ఆయన అన్నారు. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న అసోంలో ఫలితం ఆ పార్టీకి అనుకూలంగా రాకుంటే, నిఫ్టీ సూచిక 7,800 స్థాయి వద్ద మద్దతు కోల్పోయి కిందకు జారుతుందని భట్ అన్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు కొంతమేరకు ముందస్తు ఊహాగానాల ప్రకారమే ఉండవచ్చని, మార్కెట్ సెంటిమెంట్ మరీ ఘోరంగా దెబ్బతినక పోవచ్చని జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిజుహో బ్యాంక్, భారత వ్యూహకర్త తీర్థంకర్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. అయితే, రుతుపవనాలు ఆలస్యం కావడం వంటి కారణాలు పెట్టుబడుల సెంటిమెంటును ప్రభావితం చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రాకుంటే, కీలక సంస్కరణల అమలు మరింత ఆలస్యం కావచ్చని, అయితే, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రభుత్వ బలం పెరగనుండటం సానుకూల అంశమని హెచ్ఎస్బీసీ, చీఫ్ ఎకానమిస్ట్ ప్రాంజుల్ భండారీ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీజేపీ బలం పెరిగితే, సంస్కరణలు, కీలక బిల్లుల అమలు సులువవుతుందని ఆయన గుర్తు చేశారు. కాగా, ఈ సంవత్సరం 56 రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిల్లో యూపీఏ అత్యధికంగా నష్టపోనుండగా, ఆ మేరకు అధికార ఎన్డీయే లాభపడనుంది.

  • Loading...

More Telugu News