: దేవినేనికి ఐదు సార్లు ఫోన్ చేశా!... అయినా స్పందన లేదు!: హరీశ్ రావు సంచలన వ్యాఖ్య
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకుందామంటూ తాను చేస్తున్న యత్నాలకు ఏపీ సర్కారు నుంచి స్పందన లభించడం లేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్ తో నేటి ఉదయం ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సాగు, తాగు నీటి కోసం తాము చేస్తున్న విజ్ఞప్తులకు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలు వేగంగా స్పందిస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే పులిచింతల విషయంలో చర్చించుకుందాం రమ్మంటూ తాను ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఐదు సార్లు స్వయంగా ఫోన్ చేశానని హరీశ్ రావు చెప్పారు. విజయవాడ, కడప, హైదరాబాదు ఎక్కడికి రావడానికైనా సిద్ధమేనని తాను చెప్పగా, దానికి దేవినేని నుంచి సమాధానమే లేదని ఆయన ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు ఏపీ మంత్రులకు వచ్చిన ఇబ్బందేమిటని కూడా ఆయన ప్రశ్నించారు.