: ఈశాన్య భారతంలో సైనిక తిరుగుబాటు?... కలకలం రేపుతున్న వార్తలు... అదేమీ లేదంటున్న అధికారులు


భారత సైన్యంలో తిరుగుబాటా? ఇదే ప్రశ్న నిన్న జాతీయ మీడియా వార్తలను చూసిన సగటు భారతీయుడు సదరు వార్తలను ఒకటికి రెండు సార్లు పరిశీలించాడు. ఉగ్రవాదుల కార్యకలపాలతో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న పాకిస్థాన్ లాంటి దేశాల్లో సైనిక తిరుగుబాటు సర్వసాధారణమే. ఇప్పటికే ఆ దేశంలో సైనిక తిరుగుబాట్లు కూడా పెద్ద సంఖ్యలోనే జరిగాయి. అయితే అలాంటి సైనిక తిరుగుబాటు భారత్ లో సాధ్యం కాదని... నిన్నటి వార్తలపై సైనికాధికారుల వివరణతో తేలిపోయింది. వివరాల్లోకెళితే... ఈశాన్య భారతంలోని ఓ సైనిక పటాలంలో నిన్న రెగ్యులర్ ట్రైనింగ్ లో భాగంగా ఓ సైనికుడు కుప్పకూలాడు. ఛాతీ నొప్పి ఉందని చెప్పిన సదరు సైనికుడికి పరీక్షలు చేసిన వైద్యులు అతడు ఫిట్ గానే ఉన్నాడని తేల్చారు. అయితే ట్రైనింగ్ లో భాగంగా అతడు కుప్పకూలి కన్నుమూశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సైనికులు... అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఛాతీ నొప్పి ఉందని చెప్పిన బాధిత సైనికుడిని పరిశీలించిన వైద్యులు ఫిట్ గానే ఉన్నాడని ఎలా ప్రకటిస్తారని వారు వాగ్వాదానికి దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ సహచర సైనికుడు చనిపోయాడని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా సైనికాధికారులతో వారు ఘర్షణకు దిగారు. అయితే ఈ ఘర్షణలో ఎవరికీ పెద్దగా గాయాలేమీ కాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొన్ని వార్తా సంస్థలు భారత సైన్యంలో తిరుగుబాటు మొదలైనట్లు వార్తలు రాశాయి. వీటిని భారత సైన్యం ఖండించింది. సైనికుల నిరసన వాస్తవమేనని, అయితే అదేమీ అంత పెద్దది కూడా కాదని తెలిపింది.

  • Loading...

More Telugu News