: 'బుద్ధిలేని గాడిదల' రాతలపై త్వరలో గవర్నర్ ను కలుస్తా!: కమెడియన్ వేణుమాధవ్
తాను మరణించానంటూ వచ్చిన వార్తలపై టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ నిన్న ఘాటుగా స్పందించారు. ఓ వెబ్ సైట్ తో పాటు ఓ టీవీ ఛానెల్ లో వేణుమాధవ్ చనిపోయాడంటూ వచ్చిన వార్తలపై ఇప్పటికే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను కలిసిన ఆయన... తప్పుడు వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. తాజాగా నిన్న వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన వేణుమాధవ్ కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన మరణంపై వచ్చిన వార్తలను బుద్ధిలేని గాడిదలు రాసిన రాతలేనని ఆయన తేల్చేశారు. వీటిపై త్వరలోనే తాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కూడా కలుస్తానని చెప్పాడు.