: పాలేరు బైపోల్స్ నేడే!... వరుసగా నాలుగోదీ టీఆర్ఎస్ కేనా?
ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్.. విపక్షాలన్నీ ఇంకో వైపు! రసవత్తరమైన ప్రచారంతో హోరెత్తిన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన పాలేరును తన ఖాతాలో వేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపిన కేసీఆర్ విజయంపై గట్టి నమ్మకంతో వున్నారు. ఇక ఈ ఎన్నికలోనైనా టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. టీడీపీ, వైసీపీ సహా ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకుంది. రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని బరిలోకి దింపిన కాంగ్రెస్, ఇక్కడ టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వాలని పథకం పన్నింది. అయితే ప్రచారంలో ఎక్కడా ఈ కూటమి అధికార పార్టీని వెనక్కు నెట్టలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా, మూడింటిలోనూ టీఆర్ఎస్ నే విజయం వరించింది. వరుసగా నాలుగో విజయాన్ని కూడా చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగిందన్న వాదన వినిపిస్తోంది. అంతేకాక సర్వేలు కూడా టీఆర్ఎస్ దే విజయమని తేల్చిచెప్పేశాయి. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో జరగనున్న పోలింగ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.