: సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అనుమానాస్పద ఫోన్ కాల్స్... చైనా ఆర్మీ పనేనా?
గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దు వెంబడి సైనికుల వివరాలు తెలుసుకునేందుకు వస్తున్న ఫోన్ కాల్స్ తో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. చైనా సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో సైనికులను మోహరిస్తూ ఉద్రిక్తతలు రేపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, భారత దేశ సరిహద్దు గ్రామాల ప్రజలకు అనుమానాస్పద ఫోన్ కాల్స్ తల నొప్పి తెచ్చిపెడుతున్నాయి. భారత్-చైనా సరిహద్దు గ్రామాల ప్రజలకు వస్తున్న ఈ ఫోన్ కాల్స్ చైనా నుంచి వస్తున్నాయా? లేక పాకిస్థాన్ నుంచా? అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తులు తాము సైనికాధికారులమని, ప్రభుత్వాధికారులమని చెబుతూ సరిహద్దుల్లో ఉన్న భద్రత సిబ్బంది వివరాలను అడుగుతున్నారు. పహారా కాస్తున్న సైనికులు సుమారు ఎంతమంది ఉంటారు? ఏ సమయంలో ఎక్కడ ఉంటారు? వంటి వివరాలు అడిగి సమాధానాలు రాబడుతున్నారు. తాజాగా దర్బక్ గ్రామ సర్పంచ్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న ఛాంగ్ లా, సంగేత్ గ్రామాల్లో పహారా కాస్తున్న ఆర్మీ సిబ్బంది వివరాలను, ఆ సర్పంచ్ ఆకక్ది ఆర్మీ క్యాంప్ లో ఉండగా అడగటంతో అవతలి వ్యక్తి వివరాలను రాబట్టేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో సదరు వ్యక్తి తాను డిప్యూటీ కమిషనర్ నని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన మన ఆర్మీ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి అలాంటి ఫోన్ కాల్ చేయలేదని సమాధానమొచ్చింది. దీంతో ఆర్మీ అధికారులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే దగ్గర్లో ఉన్న ఆర్మీ యూనిట్‌కు తెలియజేయాలని సరిహద్దు గ్రామాల ప్రజలకు సూచించారు.