: దత్తన్న ఇంటిలో చోరీ!... ముషీరాబాదు పీఎస్ లో ఫిర్యాదు చేసిన కేంద్ర మంత్రి పీఏ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిలో దొంగలు పడ్దారు. నిన్న రాత్రి ముషీరాబాదులోని కేంద్ర మంత్రి ఇంటిలోకి గుట్టు చప్పుడు కాకుండా చొరబడ్డ దొంగలు దత్తన్నకు చెందిన ఖరీదైన సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత సెల్ ఫోన్ కోసం వెతికిన దత్తన్నకు అది కనిపించలేదు. ఇల్లంతా గాలించిన దత్తాత్రేయ... చోరులే తన సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో విషయాన్ని ఆయన తన పీఏకు చెప్పారు. మంత్రిగారి ఆదేశాలతో ఆయన పీఏ ముషీరాబాదు పోలీస్ స్టేషన్ కు వెళ్లి చోరీకి సంబంధించి ఫిర్యాదు చేశారు. దత్తన్న పీఏ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.