: విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సిందే!... మోదీతో భేటీలో చంద్రబాబు వాదన ఇదేనట!
‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సిందే’... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఎల్లుండి జరగనున్న భేటీలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేయనున్న వాదన ఇదేనట. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తన వైఖరిని సుస్పష్టం చేయడంతో ఏపీలో వేడి రాజుకుంది. ప్రజా సంఘాలతో పాటు విపక్షాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో అప్పటికే ఖరారు చేసుకున్న తన వ్యక్తిగత విదేశీ పర్యటనకు చంద్రబాబు కుటుంబంతో కలిసి వెళ్లిపోయారు. తన ఫారిన్ టూర్ ను ముగించుకుని ఈ ఉదయానికి ఆయన విజయవాడ చేరుకున్నారు. వచ్చీరాగానే అందుబాటులో ఉన్న తన కేబినెట్ మంత్రులు, వివిధ శాఖల అధికారులను పిలిపించుకుని ప్రత్యేకంగా సమాలోచనలు చేసిన ఆయన ఢిల్లీ పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహాన్ని దాదాపుగా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా కేంద్రం చెప్పిందే వినడం కాకుండా... విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సిందేనని పట్టుబట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో శాఖల వారీగా ఆయా అంశాలపై సమగ్ర నివేదికలను కూడా తన వెంట తీసుకెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ క్రమంలో రేపు పలు కీలక శాఖల అధికారులతో ఆయన వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను ప్రధాని ముందు పెట్టడంతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆయన ముందు ఏకరువు పెట్టేందుకు కూడా చంద్రబాబు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.