: ప్రత్యేక హోదాపై రాజీ ప్రసక్తే లేదు!... తేల్చిచెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
ఏపీకి ప్రత్యేక హోదాపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. వ్యక్తిగత విదేశీ పర్యటనను ముగించుకుని విజయవాడ చేరుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత సీఎం క్యాంపు ఆఫీసు నుంచి బయటకు వచ్చిన చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే లేదని ప్రకటించారు. విభజన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే నిధులు సాధిస్తామని ఆయన ప్రకటించారు.