: బ్రాహ్మణులపై కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు!... హిందూ దేవుళ్లపైనా నోరు పారేసుకున్న వైనం
జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కంచె ఐలయ్య నిన్న విజయవాడ కేంద్రంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆయన హిందూ దేవుళ్లపైనా నోరు పారేసుకున్నారు. బ్రాహ్మణులను తిని కూర్చునే సోమరులుగా ఆయన అభివర్ణించారు. ఇక హిందువుల ఆరాధ్య దైవాలు శ్రీకృష్ణుడు, రాముడు... ఏ రకంగా దేవుళ్లయ్యారని ప్రశ్నించి ఆయన కలకలమే రేపారు. సీపీఎం నేతలు పర్సా సత్యనారాయణ, నండూరి ప్రసాదరావుల సంస్మరణార్థం నిన్న విజయవాడలో ‘దేశభక్తి... భిన్న దృక్పథాలు’ అన్న అంశంపై జరిగిన సెమినార్ లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బహు భార్యత్వం ఉన్న శ్రీకృష్ణుడు ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడని ఐలయ్య ప్రశ్నించారు. ఆదివాసీల నాయకురాలు తాటకిని చంపిన రాముడు, అందగత్తె శూర్పణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు ఆరాధ్య దైవాలుగా ఎలా ఉంటారని వ్యాఖ్యానించారు. వేదాల వల్ల ప్రజలకు ఒరిగింది ఏదీ లేదని కూడా ఆయన అన్నారు. ‘‘నవ్యాంధ్ర నూతన రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెట్టారు. ఇది బుద్ధుడికి సంబంధించినది. బుద్ధుడికి, ఆరెస్సెస్ కు బద్ధ విరోధం. అందుకే నరేంద్ర మోదీ మట్టి, నీరు ఇచ్చి సరిపెట్టారు. బుద్ధునికి సంబంధించినది కనుకే రాజధానికి నిధులు ఇవ్వడం లేదు. బుద్ధుడు మతపరమైన వ్యక్తి కాదు. ఆయన జీవన శైలి వేరు. రాజధానికి శంకుస్థాపన చేసిన చోట బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి అటు జెరూసలెంకు, ఇటు తిరుపతికి కూడా వెళ్లారు. ఆ తర్వాత పావురాల గుట్టలో కనిపించకుండా పోయారు. వేదాలు గజిబిజిగా ఉంటాయి. ఏ బ్రాహ్మణుడు మంత్రాలు చెప్పినా అవి అర్థం కావు. ప్రకృతి విలువలు, మానవ విలువలను పెంపొందించినవాడు బుద్ధుడే. మహాత్మా పూలేతోనే ఆధునిక చరిత్ర ప్రారంభమైంది. అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, పుచ్చలపల్లి సుందరయ్యలు ఆదర్శప్రాయులు’’ అని ఐలయ్య తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.