: ఉగ్రవాదుల పీచమణిచే సత్తా ట్రంప్ కే ఉందట!... ఆయన గెలవాలంటూ హిందూ సేన పూజలు!


ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ముస్లిం మత చాందసవాద ఉగ్రవాదుల నుంచి ప్రపంచాన్ని రక్షించే సత్తా ఒక్క డొనాల్డ్ ట్రంప్ కే ఉందట. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దాదాపుగా ఖరారైన ట్రంప్ గెలిస్తే... ఇక అంతేనంటూ అమెరికా వాసులే భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యం సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న ట్రంప్... అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికా పరువు గంగలో కలిసినట్టేనంటూ వాదిస్తున్న అమెరికన్లే ఎక్కువగా ఉన్నారు. అయితే ట్రంప్ ఎన్నికల్లో గెలవాల్సిందేనని భారత్ కు చెందిన హిందూ సేన కోరుతోంది. కోరుకోవడమే కాదండోయ్... ట్రంప్ గెలుపు కోరుతూ ఏకంగా పూజలే చేస్తోంది. ఈ నెల 11న ఢిల్లీలో జరిగిన ఈ ప్రత్యేక పూజలకు సంబంధించిన వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రంప్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ దేవతలకు నవ ధాన్యాలు, నెయ్యితో హిందూ సేన పూజలు చేసింది. పూజల్లో భాగంగా దేవతల పటాలు పెట్టిన ఆ సంస్థ... ట్రంప్ ఫొటోకు నామం పెట్టి మరీ అక్కడ ఉంచింది. ఈ సందర్భంగా హిందూ సేన వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ కూడా ఇస్లామిక్ తీవ్ర వాదం నుంచి ముప్పు ఎదుర్కుంటోంది. ట్రంప్ గెలిస్తేనే ఆ బెడద తప్పుతుంది. ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సిందే. ఇస్లామిక్ చాందసవాదానికి సమాధానం చెప్పగల ధైర్యశాలి ట్రంప్. అందుకే ఆయనకే మా మద్దతు. ఈ విషయంలో నన్ను ఎవరు విమర్శించినా పట్టించుకోను’’ అని గుప్తా వ్యాఖ్యానించారు. ‘ఇస్లామిక్ మత చాందసవాద ఉగ్రవాదుల నుంచి ప్రపంచ మానవాళిని రక్షించగల ఆశాజ్యోతి ట్రంప్. ఆయనకే హిందూ సేన మద్దతు’ అనే బ్యానర్ ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News