: కేటీఆర్ ను ఆకాశానికెత్తేసిన హరీశ్!... డైనమిక్ మంత్రిగా అభివర్ణించిన వైనం!
తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారకరామారావులు... వరుసకు బావ, బావమరుదులైనప్పటికీ దాదాపుగా కలిసి కనిపించిన సందర్భాలు వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను భుజానికెత్తుకుని టీఆర్ఎస్ కు అంకురార్పణ చేసిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మేనల్లుడిగా ప్రచారంలోకి వచ్చిన హరీశ్ రావు... పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు. అయితే నాడు అమెరికాలో ఉద్యోగంతో కాస్తంత ఆలస్యంగా తిరిగివచ్చిన కేటీఆర్ కూడా అనతికాలంలోనే పార్టీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తర్వాత స్థానం ఎవరిదంటూ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆరాలు తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని వార్తా కథనాలు కూడా వెల్లువెత్తాయి. వీటిపై ఏమాత్రం స్పందించని వారిద్దరూ తమ పనేదో తాము చేసుకుంటూ వెళ్లారు. అయితే నిన్న హరీశ్ రావు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్ ను ఆయన డైనమిక్ మంత్రిగా అభివర్ణించారు. నిన్న గ్రేటర్ హైదరాబాదు శివారు ప్రాంతం రామచంద్రాపురంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్. హైదరాబాదు నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. దేశ విదేశాల్లో పర్యటిస్తున్న కేటీఆర్... ఐటీ, పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర రంగాలను అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నారు. హైదరాబాదులో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను కేటీఆర్ ఆహ్వానిస్తున్నారు. నగర ప్రజలు కూడా సహకారం అందించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.