: ఆ చేదు అనుభవాన్ని మరిచిపోలేదు... అయినా జయపై ప్రతీకారం ఉండదు!: డీఎంకే చీఫ్ కరుణానిధి


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార హోరు నిన్న సాయంత్రం ముగిసింది. అప్పటిదాకా అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ప్రజాస్వామ్య కూటమి పేరిట ఆ రెండు పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న డీఎండీకే చీఫ్ విజయకాంత్ కూడా ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వయసు పైబడి కదలలేని స్థితిలో ఉన్నా డీఎంకే చీఫ్, మాజీ సీఎం కరుణానిధి అధికార పక్షంపై వాగ్బాణాలు సంధించారు. అయితే నిన్న ప్రచారం ముగుస్తున్న సమయంలో ఆయన తనదైన స్టైల్లో ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తాను సీఎం పీఠాన్ని అధిరోహించినా... అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఏమాత్రం ప్రతీకార చర్యలు ఉండవని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ ప్రసంగమే చేశారు. ‘‘గడచిన ఐదేళ్ల అన్నాడీఎంకే పాలనలో ఒక్కరైనా సంతృప్తిగా ఉన్నారా? రాష్ట్రంలో అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం డీఎంకేకు ఓటేయండి. మేం అధికారంలోకి వస్తే జయపై ప్రతీకార చర్యలకు పాల్పడం. గతంలో జయ నన్ను చిత్రహింసల పాల్జేసి హతమార్చాలని అర్ధరాత్రి పోలీసులను నా ఇంటికి పంపింది. అరెస్ట్ సమయంలో నా మేనల్లుడు మురసోలి మారన్, ఇతర నాయకులు కాపాడేందుకు ప్రయత్నించి దెబ్బలు తిని గాయాలపాలయ్యారు. ఆ చేదు అనుభవాన్ని నేను ఇంకా మరిచిపోలేదు’’ అని కరుణానిధి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News