: గుంటూరులో ఘోరం!... భవన నిర్మాణంలో మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీల మృతి
నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు జరిగాయి. ఆదిలాబాదు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది చనిపోవడానికి కాస్తంత ముందుగా ఏపీలోని గుంటూరులో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. నగరంలోని లక్ష్మీపురంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాల్లోకెళితే... అక్కడ శరవేగంగా జరుగుతున్న భవన నిర్మాణంలో సాయంత్రం దాకా జిల్లాలోని ప్రత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన కూలీలంతా చురుగ్గా పనిచేశారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తవ్విన గుంటల్లో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ పెళ్లల కింద ఓ కార్మికుడు చిక్కుకుపోగా అతడిని కాపాడేందుకు సహచర కార్మికులు యత్నించారు. ఈ క్రమంలో మరోమారు మరింత పెద్ద మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో 8 మంది కార్మికులు వీటి కింద చిక్కుకున్నారు. అధికారులు వేగంగానే స్పందించినా అప్పటికే ఘోరం జరిగిపోయింది. సహాయక చర్యల్లో భాగంగా విరిగిపడ్డ మట్టిపెళ్లలను తొలగించేలోగానే ఏడుగురు కార్మికులు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న ఓ కార్మికుడిని బయటకు తీసిన సహాయక సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గుంటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.