: దైవ దర్శనానికి వెళుతుండగా కబళించిన మృత్యువు!... ఆదిలాబాదు జిల్లాలో 15 మంది దుర్మరణం
తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లా భైంసాలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం 19 మందితో బయలుదేరిన ఓ ఆటోను ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది మృత్యువాతపడ్డారు. మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే... మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా పరిధి బల్లాల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం... ఆదిలాబాదు జిల్లా సారంగాపూర్ పరిధిలోని అడెల్లి పోచమ్మను దర్శించుకునేందుకు ఆటోలో బయలుదేరింది. బాసర-భైంసా మార్గంలో దేగాం వద్ద ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఆ ఆటోను ఢీకొట్టింది. ఆటో పై నుంచి టిప్పర్ దూసుకెళ్లిన కారణంగా ఆటోలోని 15 మంది అక్కడికక్కడే చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.