: టీఆర్ఎస్ జాతీయ పార్టీగా కీలక పాత్ర పోషిస్తుంది: హరీష్ రావు
వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ జాతీయపార్టీగా కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా తమపై ప్రజలకు ఓ అభిప్రాయం ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతానికి తాము అందిస్తున్న పాలన తమకు మరింత ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని ఆయన చెప్పారు. దీంతో రానున్న ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దేశంలో చోటుచేసుకుంటున్న పలు అంశాంలపై నిర్దుష్ట అభిప్రాయాలు ఉన్నాయని, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని చక్రం తిప్పుతామని ఆయన చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీగా రాణించే అవకాశం లేదని ఆయన తెలిపారు. కేవలం కాంగ్రెస్ నాయకులపైనున్న వ్యతిరేకత కారణంగా బీజేపీని ఎన్నుకున్నారు తప్ప ప్రజలకు బీజేపీపై ప్రేమలేదని అన్నారు. బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ విషయం నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. దేశంలో జాతీయపార్టీ లేని కొరతను టీఆర్ఎస్ తీరుస్తుందని ఆయన చెప్పారు. అయితే అంత వరకు దీనిపై తాము ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ తొలి ప్రాధాన్యం తెలంగాణ అని, తెలంగాణలో సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.