: ‘హోదా’పై స్పందన లేదు, తెలంగాణ అక్రమ నిర్మాణాలపై మాట మాట్లాడబోరు: బొత్స సత్యనారాయణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అధికార తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులంటూ తెలంగాణ నీళ్లు దోచుకుంటుంటే టీడీపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ తుంగలో తొక్కిందని బొత్స విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఇంతటి గందరగోళం ఎందుకని బొత్సా ప్రశ్నించారు. హోదాపై టీడీపీ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని బొత్సా అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడెక్కడో పర్యటనలు చేస్తున్నారని, ఆయన ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే స్పష్టత కూడా రాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘స్విట్జర్లాండ్ వెళ్లారని ఒకరు చెబుతారు, మరో చోటుకి వెళ్లారని ఒకరు చెబుతారు’ అని అన్నారు. ప్రజాసమస్యలపై స్పందించకుండా తప్పించుకు తిరగొద్దని, హోదాపై, తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు స్పందించాలని ఆయన అన్నారు.