: కాంగ్రెస్ అంటే అవినీతి విశ్వవిద్యాలయం, దానిలో నేతలు పట్టాలు పొందారు: కేటీఆర్
కాంగ్రెస్ అంటే అవినీతి విశ్వవిద్యాలయమని, దానిలో కాంగ్రెస్ నేతలు పట్టాలు పొందారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతిలో ఎంతగా పండిపోయారో ప్రజలకి తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా కొత్త నాటకాలకి తెరతీస్తున్నారని ఆయన అన్నారు. ఓటమి అనేది కాంగ్రెస్ పార్టీకి పర్యాయపదంగా మారిందని, రెండేళ్లుగా కాంగ్రెస్ అన్ని చోట్లా అపజయాలే మూటగట్టుకుంటుందని విమర్శించారు. పోలింగ్‌కు ఉపయోగించే ఈవీఎం బటన్‌లలో ఏవి నొక్కినా టీఆర్ఎస్ కే ఓట్లు పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఈవీఎంల టాంపరింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తమపై ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయని, టీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేని పార్టీలన్నీ ఏకమైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి సానుభూతి పేరిట తమ ప్రత్యర్థి పార్టీలు డ్రామాలాడుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.