: భర్తపై కక్షను మరిదిపై తీర్చుకున్న యువతి... వంచిత ప్రేమకు నిండు ప్రాణం బలి!


భర్తపై కక్ష సాధించేందుకు ఆ యువతి వేసిన ప్లాన్, మరిది ప్రాణాలను బలిగొంది. ప్రేమలో ఓడిపోయానని చెబుతూ, కర్ణాటకకు చెందిన రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకున్న ఉదంతం, ఎవరూ కూడా ఊహించని మలుపు తిరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రెండు సంవత్సరాల క్రితం హసన్ కు చెందిన దివ్య అనే యువతితో, మాదేశ్ వివాహం జరిగింది. దివ్యకు అంతకుముందే వివాహం అయిందని ఓ సంవత్సరం పాటు కాపురం చేసిన తరువాత తెలుసుకున్న మాదేశ్, ఆమెను వదిలిపెట్టాడు. పెళ్లి సమయంలో కట్నం కింద ఇచ్చిన రూ. 8 లక్షలను ఇవ్వాలని దివ్య కోరినా పట్టించుకోలేదు. దీంతో మాదేశ్ కుటుంబంపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించిన దివ్య, అందుకు టెక్నాలజీని వాడుకుంటూ, ఎవరూ వేయని పన్నాగాన్ని పన్నింది. తన పేరును అనుగా పరిచయం చేసుకుంటూ, తమిళ సినీ ఇండస్ట్రీలో అంతగా పేరులేని అందమైన నటి బొమ్మలను సేకరించి ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించింది. మాదేశ్ సోదరుడు రాఘవేంద్రకు పరిచయమైంది. ఫోన్లలో ముచ్చట్లు, గంటలకొద్దీ కబుర్లతో రాఘవేంద్రను పూర్తిగా తన మాయలో పడేలా చేసుకుంది. ఆపై ఒక్కసారిగా కొన్ని రోజులు మాయమై, తిరిగి ఫోన్ చేసి, తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, నిన్ను మరచిపోలేకపోతున్నానని మాయ మాటలు చెప్పింది. తాను చనిపోతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేసేసింది. ఆపై రాఘవేంద్ర ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో, మనస్తాపానికి గురై, తన ప్రియురాలు మరణించిందన్న వేదనతో రాఘవేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత పోలీసులు దివ్యను ప్రశ్నించినప్పుడు, అనూ అనే యువతితో తన మరిదికి ప్రేమ ఉందని, వారు ఏడాదిగా ప్రేమించుకున్నారని చెప్పింది. అనూ కూడా మరణించిందని చెప్పింది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం, రాఘవేంద్ర ఫోన్ కాల్ డేటా విశ్లేషణల అనంతరం, తమదైన శైలిలో విచారించగా తను చేసిన నేరాన్ని దివ్య అంగీకరించింది. తాను కాపురం చేసిన సమయంలో అతను వదిన అన్న గౌరవం లేకుండా అమర్యాదకరంగా ప్రవర్తించాడని, ఇచ్చిన కట్నం, నగలు వారు వెనక్కివ్వలేదని, అందుకే వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ పని చేశానని తనను తాను సమర్థించుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News