: బీహార్, జార్ఖండ్ లలో ఇద్దరు జర్నలిస్టుల కాల్చివేత
గడచిన 24 గంటల్లో బీహార్, పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ లో ఇద్దరు జర్నలిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. బీహార్ లోని ‘హిందూస్థాన్’ అనే హిందీ దినపత్రికలో బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు రాజ్ దేవ్ ను సివాన్ జిల్లాలోని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. ఒక బులెట్ అతని తలలోకి, మరో బులెట్ ఛాతీలోకి దూసుకుపోయాయి. అతన్ని ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. మరో సంఘటన విషయానికొస్తే... జార్ఖండ్ లోని ఛాత్రా జిల్లాలో నిన్న రాత్రి అఖిలేష్ ప్రతాప్(35) అనే జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఒక స్థానిక ఛానెల్ లో పనిచేస్తున్న అతనిపై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.