: ఆ సమయంలో ఇందిరా గాంధీ గాయత్రీ మంత్రం జపించారు: ఇందిరా గాంధీ వ్యక్తిగత వైద్యుడు


ఫోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించిన వేళ భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ గాయత్రీ మంత్రం జపించారని ఆమె వద్ద 20 ఏళ్ల పాటు వ్యక్తిగత ఫిజీషియన్ గా పనిచేసిన కేపీ మాథుర్ తెలిపారు. 'ద అన్ సీన్ ఇందిరాగాంధీ' అని ఆయన రాసిన పుస్తకంలో ఆసక్తికరమైన విషయాలు రాశారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఒత్తిడికి గురైన సందర్భం ఏదైనా ఉందా? అంటే వుందని ఆయన చెబుతున్నారు. 1974 మే 18న ఫోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహిస్తున్న రోజున ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారట. ఉదయానే ఆమె అశాంతిగా కనిపించడంతో ఏమైందని, ఏదైనా ఆరోగ్యసమస్యా? అని ప్రశ్నించానని ఆయన తెలిపారు. అయితే, ఆమె ఏమీ కాదంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు. తరువాత తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆమె పట్టించుకోలేదని అన్నారు. 'తదేకంగా ఫోన్ వైపు చూసేవారు. ఓ సారి ఫోన్ ఎత్తినట్టే ఎత్తి రిసీవర్ పెట్టేశారు. ఫోన్ ఎప్పుడు మోగుతుందా? అని ఆమె గమనించారు. అదే సమయంలో ఆమె వద్ద నున్న నోట్ బుక్ లోకి చూస్తే అక్కడ గాయత్రీ మంత్రం కనిపించింది. అంటే ఆమె దానిని జపిస్తున్నారని భావించాను' అని ఆయన తెలిపారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో ఆమె మద్రాసు వెళ్లి హిందీని తక్కువగా చూడవద్దని, తాను తమిళం నేర్చుకుంటానని, మీరు హిందీ నేర్చుకోండని చెప్పిన ధీశాలి ఆమె అని ఆయన చెప్పారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్ ను భారత సైన్యం మట్టికరిపించిన సందర్భంగా ఇందిరా గాంధీని అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పేయి ఆమెను అపరకాళిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News