: విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ... అందరూ బాబుపై విమర్శలే, ఇక కటీఫేనా?
ఇక చంద్రబాబునాయుడితో తమకున్న బంధాన్ని తెంచుకోవాలని బీజేపీ ఆలోచిస్తోందా? నిత్యమూ ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వడం లేదని దేశం మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో, వీరికి ఘాటు ప్రతి విమర్శలే సమాధానంగా పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు నేటి ఉదయం విజయవాడలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభం కాగా, ఇక్కడకు వచ్చిన ప్రతి బీజేపీ నేత, తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, విపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించే బదులు, ప్రజలను ఆకర్షించాలని, ఫిరాయింపులపై చూపే శ్రద్ధను ధరలను అదుపు చేయడంపై చూపితే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. 100 కిలోల కందులను రైతుల నుంచి రూ. 7,500 కొన్నామని గుర్తు చేసిన ఆయన, వాటిని రూ. 11,000కు అమ్మాలని డిమాండ్ చేశారు. బియ్యాన్ని రైతుల నుంచి రూ. 1100కు కొని ప్రజలకు రూ. 4,500కు అమ్మితే పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఇక అసెంబ్లీలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ, తాము ఆది నుంచి రాజకీయ అనైతిక వ్యవహారమైన ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. హోదా ఆలస్యం కావడానికి అన్ని పార్టీలూ కారణమని అన్నారు. తమ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పూర్తి సాయం అందుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లెక్కలు చెప్పలేదని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సిద్దార్థనాధ సింగ్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే, టీడీపీతో ఇక అమీతుమీ తేల్చుకునేందుకు వీరు సిద్ధపడ్డట్టు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.