: రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు ఈరోజు లేనట్టే.. ఇక వర్షాకాల సమావేశాల్లోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ నిన్న రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉండడంతో ఏపీ ప్రజలు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ నేడు రాజ్యసభలో ఇతర అంశాలేవీ చర్చించవద్దని, పదవీ కాలం ముగిసిన రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకే నేటి సభ ఉద్దేశించబడిందని చెప్పారు. దీని పట్ల సభ్యులు కూడా సంయమనం పాటించారు. దీంతో రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు పెట్టే అవకాశం లేకుండా పోయింది. రాజ్యసభ నేడు నిరవధిక వాయిదా పడనుంది. ఇక వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పెడతారని ఆశిస్తున్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లు చర్చకు రాకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తికి గురయ్యారు.