: ఏముందని అమరావతికి వెళ్లాలి?... ఉద్యోగుల మరో మెలిక!
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో అద్దెలకు ఇళ్లు దొరికే పరిస్థితి లేదని, ఎటువంటి మౌలిక వసతులూ లేని ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలని ఏపీ ఉద్యోగులు ప్రశ్నించారు. జూన్ 30లోగా అమరావతికి వెళ్లడం సాధ్యం కాదని చెప్పిన ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ, సౌకర్యాలన్నీ కల్పించిన తరువాత మాత్రమే తరలింపు ప్రారంభించాలని, వచ్చే సంవత్సరం మార్చి వరకూ తరలింపు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అమరావతికి వెళ్లే విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు సమావేశం కాగా, పలువురు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఒక్కో మంత్రి ఒక్కోలా చెబుతున్నారని, జూన్ లో వెళ్లాలన్న నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 80 శాతం మంది ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, ముందడుగు ఎలా వేస్తారని తమ నేతల ముందు నిరసనకు దిగారు. తమ పిల్లల అడ్మిషన్లు పూర్తయ్యాయని, స్పష్టమైన హామీలు లేకుండా వెళ్లలేమని ఉద్యోగులంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను చెప్పడంతో ఈ సమావేశం రసాభాసగా మారింది. కాగా, మరోసారి ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగులు లేవనెత్తిన సందేహాలను ప్రస్తావించి, వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.