: 24 సంవత్సరాల తరువాత లోక్ సభలో అద్భుతం!


భారత చరిత్రలో ప్రస్తుత లోక్ సభ సమావేశాలు ఎంతో కాలం గుర్తుండి పోతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే, దాదాపు 24 సంవత్సరాల తరువాత విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సహకరించడం, ఆపై నినాదాలు, పోడియంలోకి సభ్యులు దూసుకెళ్లడం వంటి ఘటనలు ఒక్కటి కూడా జరగకపోవడం ఈ సభలోని స్పెషల్. రెండు పుష్కరాల తరువాత నిరసనల కారణంగా లోక్ సభ ఒక్కసారి కూడా వాయిదా పడలేదు. 16వ లోక్ సభ 8వ సెషన్ సమావేశాలు గత నెల 25న ప్రారంభంకాగా, 13 సిట్టింగ్స్ జరిగాయి. ఇందులో భాగంగా సభ్యులు 92 గంటలా 21 నిమిషాల పాటు సభలో చర్చలు జరిపారు. గతంలో 1990, 1992 సంవత్సరాల్లో లోక్ సభ ఎటువంటి వాయిదాలు లేకుండా సాఫీగా సాగిందని, తిరిగి ఇప్పుడు అదే పరిస్థితి కనిపించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఒక్క నిమిషం కూడా వృథా కాలేదని, ఇందుకు మొత్తం సభ్యులను అభినందించాల్సిందేనని తెలిపారు. కాగా, ఈ సమావేశాల్లో లోక్ సభలో 120 శాతం, రాజ్యసభలో 85 శాతం ఉత్పాదకత నమోదైనట్టు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 18 రోజుల సమావేశాల్లో సభ్యుల నిరసనల కారణంగా పది నిమిషాలో, పావు గంటో, ఆ రోజుకో సభ వాయిదా పడలేదంటే అది అద్భుతమే.

  • Loading...

More Telugu News