: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త... 8 వేల పోలీస్, 12 వేల ఇతర ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు!
ఆంధ్రఫ్రదేశ్ లోని నిరుద్యోగులకు తీపికబురు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. మొట్టమొదట దేవాదాయ శాఖలోని 1100 పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించి గ్రూప్-2 నిర్వహించాలన్నది సర్కారు అభిప్రాయం. మొత్తం 20,250 ఖాళీల భర్తీకి చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఇతర ఉద్యోగాల్లో పోలీసు శాఖలోని 8 వేల ఉద్యోగాలను, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలకు, కేంద్రం నుంచి ఇండెంట్ అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే ఆధునికీకరించిన వెబ్ సైట్ ను ప్రారంభించిన ఏపీపీఎస్సీ, తొలిసారిగా నిరుద్యోగుల వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని దగ్గర చేసింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అన్ని నోటిఫికేషన్లకూ సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి నోటిఫికేషన్ రాగానే, డైరెక్ట్ నోటిఫికేషన్లను సైతం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక గ్రూప్ 1, 2, 4 లకు చెందిన సిలబస్ మార్పులపైనా సత్వర నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వ అభిమతం. ఇప్పుడు ప్రతిపాదించిన సిలబస్ పై ఉద్యోగార్థుల నుంచి వెయ్యికి పైగా అభ్యంతరాలు రాగా, వాటినిప్పుడు ఏపీపీఎస్సీ నిపుణులు పరీశిలిస్తున్నారు. వీరి నుంచి నివేదిక రాగానే సిలబస్ సైతం మారుస్తామని అధికారులు వెల్లడించారు.