: కాసేపట్లో ఉప్పల్ లో లాస్ట్ ఫైట్... ఢిల్లీ డేర్ డెవిల్స్ తో సన్ రైజర్స్ ఢీ
కాసేపట్లో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికపై ఐపీఎల్ సీజన్ 9లో తన చివరి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఆడేందుకు సిద్దమైంది. ఈ సీజన్ లో పోటాపోటీగా రాణిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాదు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్ల ప్రధాన బలం బౌలింగే. సన్ రైజర్స్ లో ఆశిష్ నెహ్రా, భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ వికెట్ల వేటలో దూసుకుపోతుండగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో జహీర్ ఖాన్, మహ్మద్ షమి, క్రిస్ మోరిస్, ఇమ్రాన్ తాహిర్, అమిత్ మిశ్రాలతో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ లో మాత్రం ఢిల్లీ కంటే హైదరాబాదు బలంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగల డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ లలో ఏ ఒక్కరు క్లిక్ అయినా ఢిల్లీ పనైపోయినట్టే. ఢిల్లీలో డుమిని మాత్రమే నమ్మదగ్గ ఆటగాడు. మిగలిన వారంతా తమదైన రోజున రాణించి ఆకట్టుకునేవారే కావడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనమనే చెప్పాలి. అయితే పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు ఇప్పటికే నాకౌట్ పోటీలకు కావాల్సిన పాయింట్లు సాధించి ఆకట్టుకుంటున్నాయి. కాగా, నేటి మ్యాచ్ హైదరాబాదుకు హోం గ్రౌండ్ లో చివరి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్ ను గెలుచుకుని అభిమానులకు మరుపురాని అనుభూతినివ్వాలని సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు భావిస్తుండగా, సన్ రైజర్స్ కు అడ్డుకట్టవేసి, టైటిల్ వేటలో దూసుకుపోవాలని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు గట్టినిశ్చయంతో ఉంది. టైటిల్ ను సాధించి, యాజమాన్యం మెప్పుపొందాలని ఢిల్లీ ఆటగాళ్లు భావిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.