: స్టింగ్ ఆపరేషన్ చేసి దావూద్ ఇంటి ఫోటోలు సేకరించిన మీడియా
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో భారతీయ ఇంటెలిజెన్స్ విభాగం కనిపెట్టలేకపోయినా, మీడియా, హ్యాకర్లు కనిపెట్టారు. ఆయన ఫోన్ నెంబర్లను ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి హ్యాక్ చేసి వివరాలు కనుగొనగా, ఇంగ్లిష్ మీడియా సంస్థ అతని నివాసాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ కనుగొంది. అతని నివాసం పరిసరాలను ఫోటోలతో సహా అడ్రస్ ను ప్రచురించి సంచలనం సృష్టించింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని దక్షిణ కరాచీలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సింధ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముస్తఫా జతోయ్, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో నివాసానికి దగ్గర్లో డీ 13 బ్లాక్ నెంబర్ 4లో దావూద్ ఇబ్రహీం నివాసం ఉంటున్నాడని తెలిపింది. వీటిని నిర్ధారిస్తూ కొన్ని ఫోటోలను ప్రచురించింది. ఈ స్టింగ్ ఆపరేషన్ పట్ల హర్షం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వ అధికారులు, గతంలో తాము అందించిన ఆధారాల్లాగే పాకిస్థాన్ వీటిని కూడా కొట్టిపడేస్తుందని పేర్కొంటున్నారు.